సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. యువతకు ఓ స్వప్నం. ఏదో ఒక ఐటీ సంస్థలో.. ఒక్కసారి కాలుమోపితే చాలు.. కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే భావన! అందుకోసం ఎన్నో ప్రయత్నాలు!! మరోవైపు ఐటీ కంపెనీల్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సరైన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరక్క పలు టెక్ జాబ్స్‌ను భర్తీ చేయలేకపోతున్నామని వాపోతున్నాయి సాఫ్ట్‌వేర్ సంస్థలు.
ఇవే ఆ ఐదు :ఇటీవల ఇండీడ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం-ఐటీ రంగంలో కీలకంగా నిలుస్తున్న ఐదు ఉద్యోగాలు..
- డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ మేనేజర్
- డేటాబేస్ స్పెషలిస్ట్
- సీనియర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్
- సిస్టమ్ ప్రోగ్రామర్
- వెబ్ అడ్మినిస్ట్రేటర్
ఈ పోస్టుల్లో నియామకాలకు నిపుణులు దొరకడంలేదు. సరైన నైపుణ్యాలున్న అభ్యర్థులు లభించక దేశంలో డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ మేనేజర్ పోస్టులు 63 శాతం, డేటాబేస్ స్పెషలిస్ట్ 62 శాతం, సీనియర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్ 61 శాతం, సిస్టమ్ ప్రోగ్రామర్ 59 శాతం, వెబ్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలు 58 శాతం మేర భర్తీ చేయడం క్లిష్టంగా మారిందని సర్వే వెల్లడించింది.
31 శాతం పెరిగిన టెక్ జాబ్స్ :దేశంలో ఉద్యోగార్థులకు టెక్ జాబ్స్ హాట్ కేక్‌లు. చదువు పూర్తిచేసుకుంటున్న అత్యధికశాతం మంది అభ్యర్థుల లక్ష్యం సాఫ్ట్‌వేర్ కొలువులే! ఈ టెక్ జాబ్ రోల్స్ గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో 31 శాతం పెరిగాయి. వీటి కోసం అన్వేషించే అభ్యర్థుల సంఖ్య కూడా ఈ వ్యవధిలో ఎనిమిది శాతం పెరిగింది. మరోవైపు భారత్‌లోని 53 శాతం టెక్ కంపెనీలు సరైన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరక్క ఇబ్బంది పడుతున్నట్లు ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) నివేదిక సైతం పేర్కొంది. అంటే.. ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు ఉన్నారు.. ఉద్యోగాలు ఇవ్వాలనుకునే కంపెనీలు ఉన్నాయి. అయినా టెక్ జాబ్స్ భర్తీ కావడం క్లిష్టంగా మారింది.
మరి సమస్య ఎక్కడ..?టెక్నికల్ ఉద్యోగాల పరంగా స్కిల్‌గ్యాప్ ప్రధాన సమస్య. ఇటీవల ఈ సమస్య మరింత ఎక్కువైనట్లు చెబుతున్నారు. మన దేశంలో ఐటీ సంస్థలకు కేరాఫ్‌గా నిలిచే ప్రధాన నగరాల్లో(బెంగళూరు, పుణె, హైదరాబాద్)ని సంస్థలకు సరైన టాలెంట్ దొరకడం కష్టంగా మారిందని ప్రముఖ జాబ్ కన్సల్టెన్సీ ఇండీడ్ కూడా పేర్కొంది. ఈ సంస్థ నివేదిక ప్రకారం-దేశంలోని మొత్తం ఐటీ నియామకాలను చూస్తే.. బెంగళూరులో 25శాతం; పుణెలో 9శాతం; హైదరాబాద్‌లో 8 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. మొత్తం ఐటీ నియామకాల్లో ఈ మూడు నగరాల్లోనే 42 శాతం జరుగుతున్నాయి. ఇలాంటి చోట్ల కూడా స్కిల్‌గ్యాప్ సమస్య కారణంగా ఆయా టెక్నాలజీ ఉద్యోగాలకు సరిపడే నైపుణ్యాలున్న అభ్యర్థులు లభించడం కష్టంగా ఉంది. దాంతో స్కిల్‌గ్యాప్ సమస్యకు అప్‌స్కిల్లింగ్ ఒక్కటే పరిష్కారం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కాబట్టి ఐటీ ఉద్యోగ ఔత్సాహికులు తమ సాఫ్ట్‌వేర్ కొలువు స్వప్నం నిజం చేసుకోవడానికి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలోని 50 శాతంపైగా టెక్ ఉద్యోగాలకు జావా ప్రోగ్రామింగ్ స్కిల్ తప్పనిసరిగా మారింది.
అప్లికేషన్స్‌పై ప్రత్యేక దృష్టి..ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగ ఔత్సాహికులు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. అప్లికేషన్ లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, కోడింగ్, టెస్టింగ్, ఆపరేషన్స్ వంటి అంశాల్లో శిక్షణ పొందాలి. ప్రస్తుతం ఐటీ సంస్థలు తమ క్లయింట్లకు అందిస్తున్న సర్వీసులను పరిగణనలోకి తీసుకుంటే.. క్లౌడ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌పైనా పట్టు సాధించాల్సిన అవసరముంది. ఆయా నైపుణ్యాలు సాధించడం వల్ల డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో మంచి హోదాలు సొంతం చేసుకోవచ్చు.
డేటా నిర్వహణ :ప్రస్తుత పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అవసరమవుతున్న మరో కీలక నైపుణ్యం.. డేటాబేస్ మేనేజ్‌మెంట్. విస్తృతంగా ఉండే డేటాను సరైన రీతిలో సమకూర్చడం, బ్యాక్ అప్ మేనేజ్‌మెంట్ వంటివి సంస్థలకు కీలకం. కాబట్టి ఎస్‌క్యూఎల్, కంప్యూటర్ డిజైన్, ప్రోగ్రామింగ్, హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్, డేటా స్టోరేజ్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఫలితంగా ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్ ఫండమెంటల్స్, డేటాబేస్ రికవరీ వంటి అంశాల్లోనూ నైపుణ్యం లభిస్తుంది. దాంతో డేటాబేస్ మేనేజర్ హోదాను సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
ప్రోగ్రామింగ్ స్కిల్స్ :సాఫ్ట్‌వేర్ సంస్థల్లో అత్యంత ప్రధానమైనది.. ప్రోగ్రామింగ్. సాఫ్ట్‌వేర్ లాంగ్వేజెస్‌ను నేర్చుకోవడం.. సొంతంగా కోడింగ్, ప్రోగ్రామింగ్ రాసే నైపుణ్యాలు సాధించడం వల్ల ప్రోగ్రామర్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రోగ్రామింగ్ అనేది సీఎస్‌ఈ,ఐటీ విద్యార్థులకు అకడమిక్స్‌లో భాగంగా ఉంటుంది. విద్యార్థులకు రియల్ టైమ్ నైపుణ్యాలు పొందే అవకాశం కాలేజీల్లో లభించట్లేదు. ఇలాంటి అభ్యర్థులు ప్రత్యేక శిక్షణ తీసుకోవడం లాభిస్తుంది.
వెబ్‌సైట్ అడ్మినిస్ట్రేషన్ :ప్రస్తుతం ఐటీ సంస్థల్లో వెబ్‌సైట్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. వెబ్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, నెట్‌వర్క్ డిజైన్, వెబ్ అనలిటిక్స్, డేటాబేస్ ఆర్కిటెక్చర్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకుంటే వెబ్‌సైట్ అడ్మినిస్ట్రేటర్‌గా కొలువుదీరొచ్చు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ :ఇటీవల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్స్/ఆఫీసర్స్ సేవలు కూడా కీలకంగా మారుతున్నాయి. వీటికి సంబంధించి సరైన నైపుణ్యాలున్న అభ్యర్థులు లభించడం సంస్థలకు కష్టంగా మారింది. సంస్థల్లో అంతర్గతంగా కంప్యూటర్ అనుసంధాన కార్యకలాపాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించడం, ఆయా విభాగాల మధ్య అనుసంధాన ప్రక్రియ నిర్వహించడం వీరి విధులు. సంస్థలకు సంబంధించి సాంకేతిక వ్యూహాలు రూపొందించడం కూడా మరో కీలకమైన బాధ్యతగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించడం ద్వారా ఇలాంటి కొలువులు సొంతం చేసుకునే అవకాశముంది. ఈ ఉద్యోగాలకు టెక్నికల్ నైపుణ్యాలే కాకుండా.. కోఆర్డినేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలైజింగ్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్ కూడా ఎంతో అవసరం.
నైపుణ్య మార్గాలు...టెక్ నైపుణ్యాలు పొందేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న మార్గాలు అనేకం. పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు(ఐబీఎం, సిస్కో, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటివి) అందిస్తున్న షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులను పూర్తి చేయడం ఉపయుక్తం. అలాగే మూక్స్, ఎన్‌పీటీఈఎల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ కోర్సులు అభ్యసించే వీలుంది. వీటిని సద్వినియోగం చేసుకుంటే స్కిల్ గ్యాప్ అనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. తద్వారా జాబ్ రెడీగా రూపొందేందుకు మార్గం సుగమం అవుతుంది.
ఐటీ కెరీర్.. ముఖ్యాంశాలు
- 2014 ఫిబ్రవరి నుంచి 2019 ఫిబ్రవరి మధ్య కాలంలో 8శాతం పెరిగిన టెక్నాలజీ జాబ్ రోల్స్
- గత ఏడాదిలోనే 31 శాతం పెరుగుదల
- మన దేశంలోని సంస్థల్లో 50 శాతంపైగా సంస్థలు జావా ప్రోగ్రామింగ్ స్కిల్స్‌కు ప్రాధాన్యం
జాబ్ రెడీ స్కిల్స్ :ఐటీ రంగంలో ‘స్కిల్ గ్యాప్’ అనేది రోజూ వినిపించేదే! కాబట్టి విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. అకడమిక్స్‌లోని అంశాలకే పరిమితం కాకుండా.. సర్టిఫికేషన్ కోర్సులను పూర్తిచేయాలి. ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించుకుంటే.. కొలువు సొంతం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. - రమేశ్ లోగనాథన్, సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులు |
మారుతున్న ప్రొఫైల్స్..ప్రస్తుత పరిస్థితుల్లో జాబ్ ప్రొఫైల్స్ నిరంతరం మారుతున్నాయి. దాంతో వాటికి సరితూగే టాలెంట్‌ను గుర్తించడం కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. కాబట్టి విద్యార్థులు నిరంతరం స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేయాలి. కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు అవసరమైన స్కిల్స్ అందించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. - శశికుమార్, ఎండీ, ఇండీడ్ ఇండియా |
many new jobs in software.the post helps
ReplyDelete